Back to Home
మనిషిపై ‘మర మనిషి’ పెత్తనం మొదలు.. ఉద్యోగిని తొలగించిన ఏఐ బాస్

మనిషిపై ‘మర మనిషి’ పెత్తనం మొదలు.. ఉద్యోగిని తొలగించిన ఏఐ బాస్

అంతర్జాతీయంMonday, August 17, 20260 views2 min read
ఈ కథనం ఏఐ ఆధారంగా నడుస్తున్న అమెరికాలోని ఓ స్టోర్‌లో చోటుచేసుకున్న ఉద్యోగి తొలగింపు ఘటనపై దృష్టి పెడుతుంది. 23 షిఫ్టుల్లో 17 సార్లు ఆలస్యంగా వచ్చిన ఉద్యోగిపై ఏఐ మేనేజర్‌ ‘లూనా’ అందుబాటులో ఉన్న రికార్డులను విశ్లేషించి, ఉద్యోగం నుంచి తొలగించాలని సిఫార్సు చేసింది. కంపెనీ అధికారులు ఆ నిర్ణయాన్ని సమర్థించారు. అయితే ఈ ఘటన ద్వారా ఉద్యోగులపై ఏఐకి ఎంతవరకు నిర్ణయాధికారం ఇవ్వాలి, తుది నిర్ణయం మనిషిదా లేక యంత్రానిదా అనే కీలక ప్రశ్నలు ముందుకొచ్చాయి.
Key Highlights
  • .అమెరికాలో ఏఐ మేనేజర్‌ ఉద్యోగిని తొలగించాలని సిఫార్సు చేసింది.
  • .ఉద్యోగి 23 షిఫ్టుల్లో 17 సార్లు ఆలస్యంగా విధులకు హాజరయ్యాడు.
  • .శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఏండన్‌ మార్కెట్‌లో ఈ ఏఐ ఆధారిత ప్రయోగం జరుగుతోంది.
  • ‘.లూనా’ అనే ఏఐ మేనేజర్‌ ఉద్యోగులు, కొనుగోళ్లు, అమ్మకాలు, విధానాల అమలును పర్యవేక్షిస్తోంది.
  • .ఉద్యోగి హాజరు రికార్డులను విశ్లేషించిన తర్వాత లూనా తొలగింపును సిఫార్సు చేసింది.
  • .కంపెనీ అధికారులు నిర్ణయాన్ని పరిశీలించి, నిబంధనల ప్రకారం ఉందని భావించారు.
  • .ఉద్యోగ నిర్ణయాల్లో ఏఐ పాత్రపై కొత్త చర్చకు ఈ ఘటన దారితీసింది.
  • .ఏఐ నిర్ణయాలకు మానవ పర్యవేక్షణ ఎంత అవసరమన్నది కీలక ప్రశ్నగా మారింది.
23 షిఫ్టుల్లో 17 సార్లు ఆలస్యం.. ఉద్యోగం నుంచి తొలగించిన ఏఐ మేనేజర్‌ శాన్‌ఫ్రాన్సిస్కో, ఆగస్టు 16: కృత్రిమ మేధ (ఏఐ) ఇప్పటివరకు మనిషి పనిని సులభతరం చేసే సాంకేతిక సాధనంగా మాత్రమే కనిపించింది. అయితే అమెరికాలో చోటుచేసుకున్న ఓ ఘటన.. ఏఐ భవిష్యత్తులో కార్యాలయ నిర్ణయాల్లో ఎంత కీలక పాత్ర పోషించబోతోందన్న ప్రశ్నను తెరపైకి తెచ్చింది. ఒక ఉద్యోగి పనికి పదేపదే ఆలస్యంగా రావడాన్ని విశ్లేషించిన ఏఐ మేనేజర్‌.. చివరకు అతడిని ఉద్యోగం నుంచి తొలగించాలని సిఫార్సు చేసింది. నిర్వాహకులు కూడా ఆ నిర్ణయాన్ని సమర్థించారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో ఏండన్‌ లాబ్స్‌ నిర్వహిస్తున్న ఏండన్‌ మార్కెట్‌లో ఈ ప్రయోగం జరుగుతోంది. దాదాపు పూర్తిగా ఏఐ ఆధారంగా స్టోర్‌ కార్యకలాపాలను నిర్వహించే ఈ సంస్థలో ‘లూనా’ అనే ఏఐ మేనేజర్‌ను ఉపయోగిస్తున్నారు. ఉద్యోగుల నియామకం నుంచి వస్తువుల కొనుగోలు, విక్రయాలు, రోజువారీ కార్యకలాపాలు, సంస్థ విధానాల అమలు వరకు పలు అంశాలను లూనా పర్యవేక్షిస్తోంది. ఈ క్రమంలో ఓ ఉద్యోగి 23 షిఫ్టుల్లో ఏకంగా 17 సార్లు ఆలస్యంగా విధులకు హాజరైనట్లు ఏఐ వ్యవస్థ గుర్తించింది. ఉద్యోగుల హాజరు, సమయపాలనకు సంబంధించి కంపెనీ రూపొందించిన నిబంధనలను పరిశీలించిన అనంతరం.. ఆ ఉద్యోగిని కొనసాగించకూడదని లూనా సిఫార్సు చేసింది. అయితే ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఉంది. కంపెనీ కొన్ని నెలల క్రితమే ఉద్యోగుల అటెండెన్స్‌కు సంబంధించిన విధానాన్ని రూపొందించినప్పటికీ, దాని అమలుపై తగినంత పర్యవేక్షణ జరగలేదని సమాచారం. దీంతో ఉద్యోగి ఆలస్యంగా రావడం క్రమంగా అలవాటుగా మారింది. విషయం నిర్వాహకుల దృష్టికి వచ్చిన తర్వాత వారు లూనాను ఆశ్రయించారు. ఉద్యోగికి సంబంధించిన రికార్డులను ‘మెమరీ’లో పరిశీలించి, అతడిని కొనసాగించాలా? ఉద్యోగం నుంచి తొలగించాలా? అనే అంశంపై నిర్ణయం తీసుకోవాలని నిర్వాహకులు ఏఐ మేనేజర్‌ను కోరారు. అందుబాటులో ఉన్న సమాచారాన్ని విశ్లేషించిన లూనా.. ఉద్యోగం నుంచి తొలగించడమే సముచితమని సిఫార్సు చేసింది. తర్వాత కంపెనీ అధికారులు ఆ నిర్ణయాన్ని పరిశీలించారు. ఉద్యోగి పదేపదే ఆలస్యంగా రావడం సంస్థ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నందున.. తొలగింపు నిర్ణయంలో అనైతికత ఏమీ లేదని వారు భావించారు. మానవ మేనేజర్‌ ఉంటే ఇదే నిర్ణయం మరింత ముందుగానే తీసుకునే అవకాశం ఉందని సంస్థ వర్గాలు పేర్కొన్నాయి. అసలు ప్రశ్న ఇక్కడే.. ఈ ఘటనలో ఉద్యోగి నిబంధనలు ఉల్లంఘించాడా లేదా అన్నది ఒక అంశం. కానీ అంతకంటే పెద్ద ప్రశ్న.. ఉద్యోగి భవిష్యత్తును నిర్ణయించే స్థాయిలో ఏఐకి ఎంతవరకు అధికారం ఇవ్వాలి? అన్నదే. ఏఐ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అది అందుబాటులో ఉన్న డేటాను ఆధారంగా చేసుకుని విశ్లేషణ చేస్తుంది. అయితే ప్రతి ఉద్యోగి పరిస్థితి, వ్యక్తిగత సమస్యలు, కార్యాలయ వాతావరణం వంటి మానవ అంశాలను ఒక అల్గారిథమ్‌ పూర్తిగా అర్థం చేసుకోగలదా? అన్నది చర్చనీయాంశంగా మారుతోంది. ఈ ఘటనను కేవలం ఓ ఉద్యోగి తొలగింపు ఉదంతంగా చూడలేం. సంస్థల్లో నియామకాలు, పనితీరు అంచనాలు, పదోన్నతులు, ఉద్యోగాల తొలగింపుల వంటి కీలక నిర్ణయాల్లో ఏఐ పాత్ర పెరుగుతున్న నేపథ్యంలో.. తుది నిర్ణయం మనిషిదా? లేక ఏఐదా? అనే ప్రశ్నకు భవిష్యత్తులో స్పష్టమైన నియమాలు అవసరం కావచ్చని ఈ ఉదంతం సూచిస్తోంది. మనిషి రూపొందించిన సాంకేతికత.. ఇప్పుడు మనిషి పనిని మాత్రమే కాదు, మనిషి ఉద్యోగ భవిష్యత్తును కూడా నిర్ణయించే దశకు చేరుకుంటోందా? అన్న చర్చకు ఈ ఘటన తెరలేపింది.
Powered by Vividuss logo